భద్రాచలం, 7 July
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అయినప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం, పాఠశాలల యాజమాన్యాల అలసత్వం వల్ల పిల్లల భద్రత, ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారిందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ సభ్యులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం పరిధిలోని పాఠశాలల్లో భద్రతా ప్రమాణాల లోపం, సీసీ కెమెరాల కొరత వంటి అంశాలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని, వారు చూపించే మార్గదర్శకత్వంలోనే పిల్లలు తమ భవిష్యత్తును ఎంచుకుంటారని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ సభ్యుడు, గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అయితే, అధికారులు, పాఠశాలల హెడ్మాస్టర్ల నిర్లక్ష్యం వల్ల పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసే పనులను అరికట్టకపోతే, భవిష్యత్తులో వారే దేశానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
భద్రాచలం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల భద్రత, ఆరోగ్యం పట్ల యాజమాన్యాలకు శ్రద్ధ లేదని వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. అనేక ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు భద్రతా ప్రమాణాలు లేకుండానే నడుస్తున్నాయని, సీసీ కెమెరాలు లేని వైనం పిల్లల భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని పేర్కొన్నారు. బ్రేక్ టైంలో, లంచ్ బ్రేక్‌లో లేదా సాయంత్రం వెళ్లేటప్పుడు పిల్లలు కింద పడినా, గొడవపడినా, కొట్టుకున్నా, గాయపడినా ఎటువంటి సాక్ష్యం లేకుండా పోతుందని, ఇది బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఆటంకంగా మారుతుందని తెలిపారు.
పాఠశాలలు ప్రారంభమై ఇప్పటికే ఒక నెల గడిచినా, సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని, లంచ్ బ్రేక్ లో పిల్లలను ఎటువంటి బాధ్యులు లేనివారి పర్యవేక్షణలో వదిలేస్తున్నారని అన్నారు. ఈ అదును చూసుకుని పిల్లలు ఆటలతో పాటు కొట్లాటలకు కూడా అలవాటు పడుతున్నారని, ఈ ఘర్షణల్లో గాయపడిన పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొందని, పిల్లలకు తగిలే గాయాలను సర్దుకుపోతున్న తల్లిదండ్రులు, భవిష్యత్తులో ఏదైనా తీవ్ర ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహించాలని ఆయన ప్రశ్నించారు.
గతంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కూడా పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని, దీనికి ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలే కారణమవుతున్నాయని, పిల్లల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్ల వారు తప్పుదారి పట్టే అవకాశం ఉందని, క్రీడా మైదానాలు లేని పాఠశాలల వల్ల పిల్లల మానసిక వికాసం లోపించి, కేవలం చదువు అనే ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సూచించిన విషయాన్ని వేణుగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. భద్రాచలంలో ఎన్ని పాఠశాలల్లో కౌన్సిలర్లను ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, జిల్లా వైద్యాధికారి నిరంతర పర్యవేక్షణలో ఉండాలని, అధికారుల నిర్లక్ష్యం వల్లే సమాజం పాడవుతుందని ఆయన అన్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు వారిపైనే ఆధారపడి ఉందని, వారితో మనం ఎలా ప్రవర్తిస్తామో, వారూ ప్రపంచంతో అలాగే ఉంటారని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో పిల్లలకు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా దృఢంగా ఉండేలా కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని, నిత్యం పిల్లలను పర్యవేక్షణలో ఉంచాలని, సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.












