భద్రాద్రి కొత్తగూడెం, 19 November
భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను నిబంధనల ప్రకారం న్యాయబద్ధంగా నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియలో ఏకపక్ష నిర్ణయాలకు తావుండకూడదని బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను నిబంధనల ప్రకారం న్యాయబద్ధంగా నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియలో ఏకపక్ష నిర్ణయాలకు తావుండకూడదని బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ప్రతిష్టాత్మకమైన భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల నిర్వహణపై గత పదేళ్లుగా కొనసాగుతున్న సందిగ్ధత సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలు ఒక వర్గానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయి, ఎన్నికల గుర్తులు కేటాయించే దశలో కొందరిని పోటీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం సరైన విధానం కాదని ఆయన విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో సంస్థల ఎన్నికలను చూశానని, ఇలాంటి నిర్ణయాలు ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు.
రిజిస్టర్డ్ కమిటీలోని సభ్యులందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఈ విషయాన్ని ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన వారు గుర్తించాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలోనే కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
రిజిస్టర్డ్ బాడీకి ఎన్నికలు నిర్వహించే సమయంలో రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుందని, అయితే ఈ ప్రక్రియను పాటించకపోవడం ఎన్నికల కమిటీకి సరైన అవగాహన లేకపోవడాన్ని సూచిస్తోందని ఆయన విమర్శించారు.
ఎన్నికల నిబంధనలను ప్రతి దశలోనూ ఉల్లంఘించారని, తమకు అనుకూలమైన వారిని పదవుల్లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని రావులపల్లి రాంప్రసాద్ ఆరోపించారు.
వ్యాపార వర్గాలన్నీ ఈ పరిణామాలను విజ్ఞతతో పరిశీలించాలని, ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఐక్యంగా ఉండాలని ఆయన కోరారు. వ్యాపారుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.


