ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీ ఆర్టీసీ) ప్రైవేటీకరణ ప్రతిపాదనలను తక్షణమే విరమించుకోవాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో వినతిపత్రం సమర్పించారు.
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సంయుక్త కార్యదర్శి ఇళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా పేదలు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ఆర్టీసీనే ప్రధాన మార్గమని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రైవేటీకరణతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, వారి ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతుందని గోపాలకృష్ణ పేర్కొన్నారు. విద్యార్థులు, వృద్ధులు, మహిళలకు ప్రస్తుతం లభిస్తున్న రాయితీలు భవిష్యత్తులో నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ప్రజా రవాణా వ్యవస్థపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని, ప్రైవేటు సంస్థలు లాభాపేక్షతోనే నడుస్తాయని, తద్వారా ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఆర్టీసీని పరిరక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు యల్లమెల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ములపర్తి సత్యనారాయణ, సుధా గణపతి, బొంతు శ్రీనివాసరావు, సరెళ్ల రామకృష్ణ, యుల్లమెల్లి దుర్గాప్రసాద్, దొమ్మేటి శేఖర్, బాలం శేఖర్, తోత్తరమూడి వెంకటేశ్వరరావు, పాలమూరి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.












