అశ్వాపురం, 19 November
మండలంలోని ఓం శక్తి, సాయిబాబా ఆలయాల్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.7.54 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12, 13 తేదీల మధ్య అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయాల తాళాలు పగులగొట్టి, అమ్మవారి మెడలోని 105 గ్రాముల బంగారు పుస్తెల తాళ్లతో పాటు 7 కిలోల 900 గ్రాముల వెండి ఆభరణాలను అపహరించారు. ఆలయ సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాలతో, డీఎస్పీ అరుణ్ కుమార్ పర్యవేక్షణలో సీసీఎస్, పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. గురువారం గొల్లగూడెం శివారులోని సీతారామ కెనాల్ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారు ఆలయ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితులుగా షేక్ జానీ అలియాస్ జానీ షరీఫ్ (పాల్వంచ), సప్కా కాంతారావు (ఏలూరు జిల్లా), ఊర లింగయ్య (నల్గొండ జిల్లా)లను పోలీసులు గుర్తించారు. వీరిపై గతంలో వరుసగా 11, 14, 8 చోరీ కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును వేగంగా ఛేదించి, చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీస్ సిబ్బంది, సీసీఎస్ బృందాన్ని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.







