పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరమని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హారిక తెలిపారు. పుట్టిన వెంటనే శిశువుల నుండి ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు.
పోలియో ఒక ప్రమాదకరమైన వైరస్ ద్వారా వ్యాపించే అంటువ్యాధి అని, ఇది పిల్లలలో శాశ్వత వికలాంగత్వానికి దారితీసే అవకాశముందని డాక్టర్ హారిక వివరించారు. భారతదేశం పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందినప్పటికీ, పొరుగు దేశాలలో నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందని ఆమె తెలిపారు.
కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 32 గ్రామాల్లో ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించబడుతుంది. గ్రామాల్లో ప్రత్యేక బూత్‌లతో పాటు బస్టాండ్లు, సంతలు, రద్దీ ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ ఐదేళ్ల లోపు పిల్లలను సమీప పోలియో బూత్‌కు తీసుకువచ్చి టీకా వేయించుకోవాలని కోరారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.












