కోనసీమ జిల్లాలో పారిశుధ్య మెరుగుదల, అభివృద్ధి పనులను వేగవంతం చేసే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రైతు బజార్, డంపింగ్ యార్డులను పరిశీలించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్థానిక రైతు బజార్‌ను సందర్శించి, పరిసరాల పరిశుభ్రతను నిశితంగా పరిశీలించారు. రైతులు, వినియోగదారులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని అధికారులను ఆదేశించారు. రైతు బజార్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్చ్ నిర్మాణం, ఫ్లోరింగ్, డ్రైనేజీ వంటి సివిల్ పనులను తక్షణమే వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
అనంతరం డంపింగ్ యార్డును, ప్లాస్మా టెక్నాలజీ యంత్రాలను కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగా ఉత్పత్తి అవుతున్న చెత్త నిర్వహణపై ఆరా తీశారు. ప్లాస్మా టెక్నాలజీ సహాయంతో తడి, పొడి చెత్తను పర్యావరణ హితంగా బూడిదగా మార్చే ఆధునిక సాంకేతిక వ్యవస్థ పనితీరును ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు.
జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత పెరుగుతున్న స్థానిక అవసరాలకు, ఉత్పత్తి అవుతున్న చెత్త పరిమాణానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ప్లాస్మా యూనిట్ సామర్థ్యాన్ని తక్షణమే పెంచాలని మున్సిపల్, పారిశుద్ధ్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తద్వారా డంపింగ్ యార్డులో చెత్త పేరుకుపోకుండా చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు కీలక అంశాలపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, సత్వరమే పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
స్థానిక కలెక్టరేట్లో పురపాలక సంఘం, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్, రోడ్ల వెంబడి డంపింగ్ చేస్తున్న చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. రోజువారీ ప్లాస్మా టెక్నాలజీ సామర్థ్యాన్ని బట్టి, పురపాలక, గ్రామాలకు ఒక నిష్పత్తిని నిర్దేశించి చెత్తను సేకరించాల్సి ఉంటుందని తెలిపారు. జూలై 10 నాటికి ప్లాస్మా టెక్నాలజీ యంత్రాలను ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు.







