అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తేగడలోని శ్రీ సరస్వతి విద్యానికేతన్ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో నేర్చుకున్న యోగాసనాలను విద్యార్థులు తమ ఇళ్లల్లో తల్లిదండ్రులకు నేర్పించి, వారితో కలిసి యోగా చేయడం విశేషం.
శ్రీ సరస్వతి విద్యానికేతన్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు యోగాపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులందరి చేత అత్యంత క్రమశిక్షణతో కూడిన "సూర్య నమస్కారాలు" మరియు వివిధ రకాల యోగాసనాలను వేయించి, వాటి ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు.
"మన దేశం – మన కుటుంబం – మన యోగ" అనే నినాదంతో పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాలలో యోగాసనాలు మరియు సూర్య నమస్కారాలు నేర్చుకున్న విద్యార్థులు, నేరుగా తమ ఇళ్లకు వెళ్లి తమ తల్లిదండ్రులకు సైతం ఆ యోగాసనాలను నేర్పించారు. ఈ ఉదయం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఇళ్లలోనే ఎంతో ఉత్సాహంగా యోగాసనాలు వేసి, ఆ ఫోటోలను పాఠశాల యాజమాన్యానికి పంపడం విశేషం.
పాఠశాల డైరెక్టర్ లిఖిత మాట్లాడుతూ, "మన భారతదేశంలో పుట్టిన 'యోగా' ఈరోజు అంతర్జాతీయంగా గుర్తింపు పొంది, ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శంగా నిలవడం మన దేశానికి ఎంతో గర్వకారణం" అని తెలిపారు. మన సనాతన ధర్మానికి ప్రతీక అయిన ఈ యోగ విజ్ఞానాన్ని కాపాడుకుంటూ, ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యం వెల్లివిరియాలనే ఉద్దేశంతోనే ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఇళ్లలోనే యోగా చేయడం ఎంతో ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.
విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి యోగా చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పాఠశాల పరిధిలోనే కాకుండా ఇళ్లకు కూడా యోగాను తీసుకెళ్లిన ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను, విద్యార్థులను పలువురు ప్రముఖులు, తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా అభినందించారు.











