భద్రాచలం, 30 June
చర్ల మండలంలోని మారుమూల జీపీఎస్ పాఠశాలలను మంగళవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన స్థాయిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఉద్దీపకం వర్క్‌బుక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లల హాజరు శాతం పెంచేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో నడుస్తున్న జీపీఎస్ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలకు పునాది నుండే విద్యావ్యవస్థ బలోపేతం కావడానికి ఉద్దీపకం వర్క్‌బుక్‌లోని అంశాలు ప్రతి పిల్లవానికి అందరికీ అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
మంగళవారం నాడు చర్ల మండలంలోని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న చెన్నాపురం, ఉయ్యాలమడుగు జీపీఎస్ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో కాసేపు ఉపాధ్యాయుని పాత్ర పోషించిన అనంతరం, విద్యార్థి పాత్ర పోషించి ఉద్దీపకం వర్క్బుక్కు సంబంధించిన అంశాలు పిల్లలకు బోధిస్తున్న తీరును, తానే స్వయంగా పిల్లల చేత బోర్డుపై వ్రాయించి, వర్క్‌బుక్‌లోని ప్రతి అంశం పిల్లల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పిల్లలు ఉద్దీపకం వర్క్‌బుక్‌లోని అంశాలు మరియు చతుర్వేద ప్రక్రియలలో వెనుకబడి ఉన్నట్లు ఆయన గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలందరూ ఉద్దీపకం వర్క్‌బుక్‌లోని అంశాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలని, దాని నిర్వహణ ప్రతిరోజూ సక్రమంగా జరగాలని అన్నారు. పిల్లల హాజరు శాతం తక్కువగా ఉండకుండా చూసి, అందరూ పాఠశాలకు వచ్చేలా సంబంధిత ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు పిల్లలను తప్పనిసరిగా బడికి పంపించేలా సూచించాలని సూచించారు.
ఉపాధ్యాయులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలలకు రావాలని, ఏవైనా సమస్యలుంటే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఉద్దీపకం వర్క్‌బుక్ నిర్వహణ తప్పనిసరిగా పిల్లలు అర్థం చేసుకొని రాసేలా ఉపాధ్యాయులు వారిని ఉత్తేజపరచాలని అన్నారు.
చెన్నాపురం పాఠశాలలో 55 మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారని, మరొక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరగా, త్వరలోనే ఇంకొక ఉపాధ్యాయుడిని నియమిస్తానని పీఓ తెలిపారు.
అనంతరం ఐటీడీఏ పీవో బి. రాహుల్ ఆదేశాల మేరకు, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి శ్రీమతి చందన తిమ్మిరి గూడెం జీపీఎస్ పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి చందన, ఉపాధ్యాయులు రమేష్, శ్రీనివాస్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.












