చర్ల బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్ యాజమాన్యం, సిబ్బంది నిబంధనలను ధిక్కరిస్తూ డీజిల్ అక్రమ అమ్మకాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక రైతులకు డీజిల్ అందుబాటులో ఉంచకుండా, ఛత్తీస్గఢ్ వ్యాపారులకు అర్ధరాత్రి వేళల్లో భారీగా అమ్ముతున్నట్లు సమాచారం.
అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా, నోటీసులు ఇచ్చినా పెట్రోల్ బంక్ యాజమాన్యం తీరులో ఎటువంటి మార్పు రావడం లేదని తెలుస్తోంది. స్థానిక అవసరాలను విస్మరించి, చట్టవిరుద్ధంగా డీజిల్ అమ్మకాలను కొనసాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం బల్క్ డీజిల్ అమ్మకాలను నిషేధించినప్పటికీ, ఈ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ, బంక్ మేనేజర్ల సహకారంతోనే ఈ అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రతి బ్యారెల్ డీజిల్ అమ్మకంపై అదనంగా 500 నుండి 600 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలపై అధికారులు తక్షణమే స్పందించి, విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.






