ములుగు, 2026-07-17
ములుగు జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక వరి నారు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పైరును కాపాడుకోవడానికి రైతులు బిందెలతో నీళ్లు మోయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ములుగు జిల్లా వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం పలు మండలాల్లో గట్టిగానే ఉందని, సరైన సమయానికి వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రతి ఏటా కొన్ని వేల ఎకరాల్లో వరి నారు సాగు చేసుకునే రైతులు, ఈ ఏడాది నారు పోసినా వర్షాలు లేక పలుచోట్ల ఎండిపోవడంతో కష్టాలు ఎదుర్కొంటున్నారు.
తన పైరును కాపాడడం కోసం పక్కనే ఉన్న గుంటలో నీళ్లను బిందెలతో మోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 'రైతే రాజు' అని ప్రభుత్వాలు చెబుతున్నా, రైతుకు కష్టం వస్తే పట్టించుకోవడం లేదని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
కొన్ని ప్రాంతాలలో చెరువులు, ప్రాజెక్టులు పక్కనే కొన్ని వేల ఎకరాలు ఉన్నప్పటికీ, కనీసం ఒక్క ఎకరానికి కూడా నీరు అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని రైతులు, రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. పంట పొలాలు ఎండి ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్ నినో ప్రభావం, వాతావరణంలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని, చేసిన అప్పులు తీర్చలేక కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ నీళ్లను పరిసరాల చెరువులకు అందేలా కృషి చేయాలని, పంట పొలాలకు నీరు అందించాలని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని రైతు సంఘాలు పేర్కొన్నాయి.
వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎల్ నినో ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం లేదని, తక్కువ నీటితో సాగు చేసే పంటలను వేయాలని రైతులకు సూచించారు.









