వెంకటాపురం, 5 September
మండలంలో ప్రెజర్ బాంబు పేలి మరణించిన మడకం నాగేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసి సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు తాసిల్దార్ ను కలిసి మెమోరాండం సమర్పించారు.
ఇటీవల అడవిలో ప్రెజర్ బాంబు పేలి మరణించిన నూగూరు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆదుకోవాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ (జీఎస్పీ) మరియు ఆదివాసి సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మండల తాసిల్దార్ వేణుగోపాల్ ను కలిసి మెమోరాండం సమర్పించారు. జీవనోపాధి కోసం కంక బొంగుల కోసం అడవిలోకి వెళ్లిన మడకం నాగేశ్వరరావు, ప్రెజర్ బాంబు పేలి మరణించారని, ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్ సొంది వీరయ్య మాట్లాడుతూ, ములుగు జిల్లా మండలం నూగురు కాలనీ గ్రామానికి చెందిన మడకం నాగేశ్వరరావు కర్రగుట్టల సమీపంలో బుధవారం జరిగిన విషాదకర ఘటనలో మృతి చెందారని, ఆయన కుటుంబం నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసుల జీవన విధానం అడవితో ముడిపడి ఉంటుందని, పోలీసు యంత్రాంగం ఆపరేషన్ కగార్ పూర్తయిందని చెప్పి, ప్రెజర్ బాంబులను తొలగించకుండా ఆదివాసి బిడ్డలను రక్తపు మడుగుల్లో బలి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అడవుల్లో మిగిలి ఉన్న ప్రెజర్ బాంబులను తొలగించి ఆదివాసి జీవన విధానానికి తోడ్పడాలని, మృతి చెందిన నిరాశ్రయులైన మడకం నాగేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి, జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్, మేజర్ సర్పంచ్ తాటి సరస్వతి, బెస్తగూడెం సర్పంచ్ భీమేశ్వరి, పాత్రపురం సర్పంచ్ బొగ్గుల పుష్పవతి, తిప్పపురం సర్పంచ్ చందా శిరీష, మాజీ సర్పంచ్ జజ్జరి నారాయణమ్మ, సూరవీడు సర్పంచ్ ఇర్ప మురళి, పూనేం సూర్యం తదితరులు పాల్గొన్నారు.








