తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట మండలం వడిశలేరు – రంగంపేట మధ్య టాటా ఏస్ గూడ్స్ వాహనం టైరు పేలి అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
బాపట్ల జిల్లా కొల్లూరులో నిర్మాణ పనులు ముగించుకుని సామర్లకోట, పిఠాపురం ప్రాంతాలకు తిరిగి వెళ్తున్న కూలీలతో వెళ్తున్న ఈ వాహనం, వడిశలేరు – రంగంపేట మధ్య ప్రమాదానికి గురైంది. వాహనంలో కూలీలతో పాటు నిర్మాణ సామగ్రి కూడా తరలిస్తున్నారు.
ప్రమాదంలో సామర్లకోటకు చెందిన మాసకపల్లి బాబు, మురమళ్ల రాజు, కాకాడ రాజు మృతి చెందారు. గాయపడిన ఎనిమిది మందిని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టైరు పేలడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.











